: భీమవరంలో బీహార్ దొంగల బీభత్సం... పోలీసుల అదుపులో ముగ్గురు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీహార్ దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో గుడికి వెళ్లి వస్తున్న ఓ మహిళ మెడలోని చైన్ ను తస్కరించిన దొంగలు, పారిపోయే క్రమంలో హల్ చల్ చేశారు. దొంగల దాడిని గమనించిన స్థానికులు వారిని వెంబడించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు కూడా దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు బీహారీ దొంగలు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. అయితే కాల్పులకు దిగిన దొంగను భీమవరం కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు చాకచక్యంగా పట్టుకుని బంధించారు. అనంతరం స్థానికుల సహకారంతో మిగిలిన ఇద్దరు బీహారీ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.