: కాఫీతో బరువు తగ్గొచ్చట!
కాఫీలో ఉండే ఓ సమ్మేళనం ఊబకాయానికి కారణమయ్యే వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది. జార్జియా యూనివర్శిటీ పరిశోధకులు కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ అనే పదార్థాన్ని గుర్తించారు. ఇది ఎలుకల్లో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడమే కాకుండా, వాటి కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుందట. దీని గురించి యాంగ్జీ మా అనే రీసెర్చ్ అసోసియేట్ వివరిస్తూ, మునుపటి అధ్యయనాలు కాఫీతో టైప్ 2 మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ముప్పు తగ్గుతుందని తెలిపాయని పేర్కొన్నారు. తమ అధ్యయనం వాటికి కొనసాగింపు వంటిదని, కాఫీలో ఉండే ప్రత్యేక సమ్మేళనంతో కలిగే ప్రయోజనాలను ఇది వివరిస్తుందని తెలిపారు. ఈ క్లోరోజెనిక్ యాసిడ్ కాఫీలో సమృద్దిగా లభ్యమవుతుందని, యాపిల్ పండ్లు, పియర్స్, టమేటాలు, బ్లూబెర్రీల్లోనూ విరివిగా ఉంటుందని యాంగ్జీ పేర్కొన్నారు.