: ఏపీ మంత్రులు గంటా, అయ్యన్న మధ్య కోల్డ్ వార్!
ఆంధ్రప్రదేశ్ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఇదివరకే ఇరువురి మధ్య విభేదాలున్నా బయటపడని ఇద్దరు మంత్రులు తాజాగా ఉద్యోగుల బదిలీల విషయంలో మత్రం సిగపట్లు పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో సీఎం పేషీ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్రపై చిందులు తొక్కిన అయ్యన్న పెద్ద దుమారాన్నే రేపారు. దీనిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు గంటా వర్గం వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీ వీడి తిరిగి సొంత గూటికి చేరిన దాడి వీరభద్రరావుతో శనివారం మద్యాహ్నం గంటా రెండు గంటలకు పైగా సుదీర్ఘ భేటీ నిర్వహించారు. అనంతరం తన వర్గ ఎమ్మెల్యేలతో ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం. విశాఖ జిల్లాలో టీడీపీకి సీనియర్ నేతగా కొనసాగుతున్న చింతకాలయ అయ్యన్నపాత్రుడు పార్టీకి తొలి తరం నేత. అంతేకాక పార్టీ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నా, పార్టీని అంటిపెట్టుకుని ఉండటమేకాక పార్టీకి కొండంత అండగా నిలబడ్డ అతికొద్ది మంది నేతల్లో అయ్యన్న ఒకరు. అయితే పలు పార్టీలు మారి, సొంత గూటికి చేరిన గంటా ఈ దఫా తన ప్రాబల్యాన్ని పెంచుకునే యత్నాలను ముమ్మరం చేశారు. అంతేకాక విశాఖలో చక్రం తిప్పేందుకు కూడా ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువురు నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. మరి ఇది ఎంతదాకా వెళుతుందో చూడాలి.