: ముఖ్యమంత్రి ఇంతకు దిగజారతారని ఊహించలేదు: రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అమ్మాయిలతో ఆరోపణలు చేయించే స్థాయికి దిగజారతారని తాను ఊహించలేదని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, ఎంపీ కవితపై తాను చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తే ఏ విచారణకైనా సిద్ధమని సవాలు విసిరారు. అవకతవకలను, చేతకానితనాన్ని ప్రశ్నించినందుకు తనపై కక్షగట్టిన ప్రభుత్వం, తన ప్రతిష్ఠ మంటగలిపేందుకు అన్ని రకాల దాడులకు పూనుకుందని అన్నారు. గంట క్రితం టీఆర్ఎస్ సభ్యులు తన ఇంటిపై దాడికి దిగారని ఆయన తెలిపారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. దాడులతో లొంగదీసుకోవచ్చనుకుంటే అది పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు. అమ్మాయిలతో ఆరోపణలు చేయించడం ఏ సంస్కృతి? అని ఆయన నిలదీశారు.