: టీ సర్కారుపై నేడు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న టీటీడీపీ!
తెలంగాణ సర్కారు తీరుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ గవర్నర్ కు ఫిర్యాదు చేయనుంది. గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం వ్యవహరించిన తీరు సరిగా లేదని టీటీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాక సభలో తమ గొంతు నొక్కేందుకే సస్పెన్షన్ల వేటును అధికార పక్షం ప్రయోగించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వితండ వాదనలకు దిగుతున్న మంత్రులు, అధికార పార్టీ సభ్యులు సభా నియమాలను పాటించడం లేదని, స్పీకర్ మాట కూడా వారు వినడం లేదని టీటీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం నాటి సభలో సర్కారు వ్యవహార తీరుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు తెరతీసిన ఆ పార్టీ నేతలు సాయంత్రం గవర్నర్ ను కలవనున్నారు. తెలంగాణ సర్కారు ఒంటెత్తు పోకడలపై వారు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఫిర్యాదు చేయనున్నారు.