: ఢిల్లీలో 7 శాతం పెరిగిన విద్యుత్ బిల్లులు!
ప్రజా ప్రభుత్వం లేకపోతే ఎలాంటి విపరిణామాలు చోటుచేసుకుంటాయో, దేశ రాజధాని ఢిల్లీ వాసులకు తెలిసొచ్చింది. పది నెలలుగా రాష్ట్రపతి పాలనలో ఉన్న ఢిల్లీలో ఒకేసారి 7 శాతం విద్యుత్ బిల్లులను పెంచుతూ ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం శనివారం నుంచి అమలులోకి రానుంది. ఢిల్లీకి విద్యుత్ ను సరఫరా చేస్తున్న మూడు విద్యుత్ పంపిణీ సంస్థల డిమాండ్ల మేరకు ప్రజలపై భారం మోపేందుకు ఆ సంస్థ ఎంచక్కా తలాడించింది. విద్యుత్ కొనుగోలుకు పంపిణీ సంస్థలు వెచ్చించిన మొత్తాలను తిరిగి రాబట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈఆర్సీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. డీఈఆర్సీ నిర్ణయంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ కూడా మండిపడింది. విద్యుత్ బిల్లుల పెంపుపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో పాటు గవర్నర్ నజీబ్ జంగ్ ను కూడా కలసి ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ చెప్పారు.