: మోదీ బాటలో పారికర్... రేడియో, డీడీల్లో రక్షణ మంత్రి కార్యక్రమాలు!
గోవా ముఖ్యమంత్రిగా ఉండగానే మనోహర్ పారికర్ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీకి ఓ అభిప్రాయం ఉంది. మరింత కచ్చితంగా చెప్పాలంటే, ఆరెస్సెస్ లో ఉన్నప్పుడే పారికర్ వైవిధ్య పనితీరు మోదీకి బాగా తెలుసు. అందుకే ముఖ్యమంత్రి పదవికి ఆయన చేత రాజీనామా చేయించి మరీ, కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు. మోదీ నమ్మకాన్ని పారికర్ వమ్ము చేయదలచుకోలేదు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పారికర్ నేరుగా కార్యరంగంలోకి దిగిపోయారు. తాజాగా మోదీలానే ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో ప్రత్యక్షం కానున్నారు. తన ప్రసంగాన్ని ప్రజలకు వినిపించడానికి కాదు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి! నేడు దూరదర్శన్ పంజాబీ ఛానెల్ లో సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల మధ్య పారికర్ టీవీ వీక్షకుల ప్రశ్నలకు నింపాదిగా సమాధానం చెప్పనున్నారు. ఇక రేడియో విషయానికొస్తే, ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రజలు సంధించే ప్రశ్నలకు ఆయన జవాబులు చెబుతారు.