: తెలుగోడి దెబ్బా, మజాకా!...నాలుగు రికార్డులు ఈడెన్ లో లిఖించెన్!
ఈడెన్ గార్డెన్స్ లో రోహిత్ శర్మ వన్ మ్యాన్ షో రికార్డులపై రికార్డులు సృష్టించింది. నాలుగు రికార్డులకు ఈడెన్ వేదికైంది. టీమిండియా మాత్రమే 5 సార్లు 400 పైచిలుకు పరుగులు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఒక వన్డేలో అత్యధిక (33) ఫోర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ రికార్డు పుటలకెక్కాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో రెండు సార్లు డబుల్ సెంచరీ బాదిన ఏకైక ఆటగాడిగా తన పేరిట చిరిస్థాయిగా నిలిచిపోయే రికార్డును పదిలపరచుకున్నాడు. టాలెంటున్నా నిలకడలేని ఆటగాడిగా పేరుతెచ్చుకున్న రోహిత్ శర్మ మూలాలు తెలుగువే... తాతగారిల్లు వైజాగ్ కు అప్పుడప్పుడు వచ్చి పోతుంటాడని అతని సన్నిహితులు చెబుతుంటారు. రోహిత్ శర్మ తల్లి పూర్ణిమా శర్మది విశాఖపట్టణం. రోహిత్ బాల్యం విశాఖలోనే గడిచింది. విశాఖతో రోహిత్ కు అంతులేని అనుబంధం. ఎన్నో అనుభూతులు మిగిల్చిన విశాఖ అంటే రోహిత్ శర్మకు తగని మక్కువ. విశ్రాంతి కావాలంటే రోహిత్ ఎంచుకునే ప్రదేశం విశాఖ అని అతని ఆత్మీయులు పేర్కొంటారు. విశాఖ నగరమంటే రోహిత్ శర్మకు చాలా ఇష్టమని వారు చెబుతారు.