: సునంద పుష్కర్ వస్తువులు అదృశ్యం: 9 నెలల తర్వాత పోలీసుల వెల్లడి
దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయట. సునంద పుష్కర్ కేసులో పోలీసులు మాత్రం తొమ్మిది నెలలకు గాని మేల్కొనలేదు. కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించి అప్పుడే తొమ్మిది నెలలు కావస్తోంది. ఆమె చనిపోయిన వెంటనే దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు, తాజాగా ఓ విషయాన్ని కొనుగొన్నట్లు ప్రకటించారు. సునంద చనిపోయిన గదిలో ఆమె దుస్తులు, చెప్పులు అదృశ్యమయ్యాయట. గతవారం పోలీసులు సునంద మరణించిన లీలా ప్యాలెస్ హోటల్ లోని 345 గదిని మరోమారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ కొత్త విషయాలు తెలిశాయట. అంటే తొలిసారి గదిని అణువణువు పరిశీలించిన పోలీసులకు ఈ మాత్రం ఆధారాలు నాడు దొరకలేదు. సునంద దుస్తులు, చెప్పులను ఎవరో అక్కడి నుంచి తరలించి ఉంటారని తాజా పరిశీలనలో పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఇదిలా ఉంటే, తమ అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలిచే మరో ప్రకటనను కూడా పోలీసులు చేశారు. చనిపోయే ముందు గదిలోకి వెళ్లిన సునంద హ్యాండ్ బ్యాగ్ లాంటిదేమీ తీసుకెళ్లలేదు. అయితే గదిలో అదృశ్యమైన వస్తువుల్లో ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా ఉందని పోలీసులు చెప్పడం విశేషం.