: ఏపీలో బదిలీలు... జోరందుకున్న పైరవీలు!
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో పైరవీలు జోరందుకున్నాయి. బుధవారం బదిలీల కోసం కొందరు, బదిలీలు నిలుపుకునేందుకు మరికొందరు సచివాలయానికి పోటెత్తారు. సచివాలయంలోని ఏపీ మంత్రులు, ఉన్నతాధికారుల ఛాంబర్లున్న బ్లాకులు బదిలీల కోసం వచ్చిన ఉద్యోగులతో కిటకిటలాడాయి. కుర్చీలు లేక, నిలబడలేక ఉద్యోగులు కారిడార్లలో కూర్చుండిపోయారు. మరోవైపు బదిలీల కోసం వచ్చిన వారితో మంత్రులు, ఉన్నతాధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. తమకు కావాల్సిన ఉద్యోగి కోసం పలువురు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో సిఫారసు లేఖలు జారీ చేయడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికార వర్గాలు కూరుకుపోయాయి. బుధవారం ఒక్కరోజే దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన ఉద్యోగుల బదిలీల కోసం నేరుగా సచివాలయానికి వచ్చారు. ఇక మంత్రులు కూడా సిఫారసు లేఖలను జారీ చేసిన వారి హోదాల వారీగా పరిగణనలోకి తీసుకోవాలని తమ పరిధిలోని ఉన్నతాధికారులకు సూచించారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న బదిలీలు కావడంతో భారీ స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.