: 2015 వరల్డ్ కప్... భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు 12 నిమిషాల్లో అమ్ముడయ్యాయి!
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే, ఆ రెండు దేశాలకే కాదు ప్రపంచ దేశాల క్రికెట్ అభిమానులకు కూడా కన్నుల పండుగే. ఇక ప్రపంచ కప్ లో ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. నిన్న, నేడు, రేపు ఎప్పుడైనా ఈ మ్యాచ్ లకు దక్కే ప్రాధాన్యమే వేరు. తాజాగా ఈ వాదనను నిజం చేసే ఘటన ఒకటి చోటుచేసుకుంది. 2015 ప్రపంచ కప్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లు సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్వహించనున్నాయి. వరల్డ్ కప్ లో భాగంగా ఫిబ్రవరి 15న భారత్, పాక్ ల మధ్య ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో మ్యాచ్ జరగనుంది. 50 వేల సీట్ల కెపాసిటీతో నిర్మితమైన నూతన స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. బుధవారం ప్రారంభమైన టికెట్ల విక్రయం కేవలం 12 నిమిషాల్లో పూర్తైంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారత్, పాక్ ల నుంచి 20 వేల మంది టికెట్లను కొనుగోలు చేశారు. ఇక అక్కడ స్థిరపడ్డ భారతీయులు, పాకిస్థానీలు కూడా మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. టికెట్లు దొరక్కపోయినా మ్యాచ్ జరిగే ఆడిలైడ్ కు వెళ్లాల్సిందేనని భారత్, పాక్ లకు చెందిన పలువురు క్రీడాభిమానులు యత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రపంచ కప్ లో ఇప్పటిదాకా భారత్ దే పైచేయిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.