: సచిన్ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా: కపిల్ దేవ్
టీమిండియా జట్టు శిక్షకుడిగా తనపై క్రికెటర్ సచిన్ టెండుల్కర్ వెల్లడించిన అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తెలిపాడు. అయితే, ఆ సున్నితమైన అంశంపై కౌంటర్ కామెంట్ చేసి అతనితో వివాదంలో చేరేందుకు తిరస్కరించాడు. ఇటీవల 'ప్లేయింగ్ ఇట్ మై వే' పేరుతో సచిన్ ఆత్మకథను విడుదల చేశాడు. అందులో, కపిల్ జాతీయ జట్టుకు కోచ్ గా ఉన్న సమయంలో తనను "నిరాశపరిచాడు" అంటూ సచిన్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు కపిల్ స్పందిస్తూ, "కొంతకాలం నుంచి తనకున్న అభిప్రాయం అది. నా గురించే కాబట్టి మంచిదే. ప్రతి ఒక్కరికీ తమ వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. నేను దాన్ని తప్పకుండా గౌరవిస్తా. ఇక ఆ విషయంలో చెప్పడానికి ఏమీ లేదు" అని ఈ హర్యానా హరికేన్ స్పష్టం చేశాడు. 1999 సెప్టెంబర్ నుంచి 2000 సెప్టెంబర్ వరకు కపిల్ ఇండియా జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు.