: బల పరీక్షలో ఫడ్నవీస్ సర్కారు విజయం... ఆదుకున్న ఎన్సీపీ!
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. 122 సీట్లను సాధించి మహారాష్ట్ర అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ఫడ్నవీస్ నేతృత్వంలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి మరో 23 మంది సభ్యుల బలం అవసరమైంది. ఈ నేపథ్యంలో 41 సీట్లను గెలిచిన ఎన్సీపీ, బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించింది. శివసేనతో దోస్తీ పూర్తిగా కటీఫ్ కాని నేపథ్యంలో ఎన్సీపీ మద్దతు విషయంలో బీజేపీ నిన్నటిదాకా నిర్ణయం తీసుకోలేదు. అయితే శివసేన దాగుడుమూతల వ్యవహారంతోనే కాలం వెళ్లదీసింది. అంతేకాక ఫడ్నవీస్ సర్కారుకు మద్దతు ప్రకటించబోమని బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశానికి ముందు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం నాటి విశ్వాస పరీక్షలో ఫడ్నవీస్ సర్కారు ఎన్సీపీ మద్దతును స్వీకరించింది. సభలో విశ్వాస పరీక్ష సందర్భంగా మూజువాణి ఓటుతోనే ఫడ్నవీస్ ప్రభుత్వం నెగ్గినట్లు కొత్తగా ఎన్నికైన స్పీకర్ హరాభావ్ హెగ్డే ప్రకటించారు. ఇక దీంతో మరో ఆరు నెలల దాకా ఫడ్నవీస్ సర్కారుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్సీపీ మద్దతుతో ఆ రాష్ట్రంలో ఫడ్నవీస్ పూర్తి కాలం పాటు అధికారం కొనసాగించే అవకాశం ఉంది.