: కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే...లేకుంటే సభాహక్కుల ఉల్లంఘన: రేవంత్
హెరిటేజ్ పై అవాస్తవ ఆరోపణలు చేసిన మంత్రి కె.తారకరామారావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల కల్తీపై జరిగిన చర్చలో భాగంగా హెరిటేజ్ ప్రస్తావన వచ్చింది. దీనిపై మాట్లాడిన కేటీఆర్, హెరిటేజ్ ను కేరళలో నిషేధించారని వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ సభ్యులు భగ్గుమన్నారు. సభ వాయిదా పడ్డ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రేవంత్ రెడ్డి, హెరిటేజ్ పై విధించిన నిషేధాన్ని కేరళ ఉపసంహరించిందని తెలిపారు. అయితే ఈ వాస్తవాన్ని మరుగున పెట్టి కేటీఆర్ సభలో అవాస్తవాలను వెల్లడించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సభలో అవాస్తవాలను వల్లించిన మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు.