: సెహ్వాగ్, గంభీర్, జహీర్ ల కథ ముగిసినట్టే!


వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్... టీమిండియాకు విలువైన సేవలు అందించిన ఆటగాళ్లు. ఒకప్పుడు ఈ త్రయం లేకుండా భారత జట్టును ఊహించలేని పరిస్థితి! ఫామ్ లేమి, గాయాలు ఈ ముగ్గురిని జట్టుకు దూరం చేశాయి. మరోవైపు, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి వంటి ప్రతిభావంతుల రాక కూడా వీరిపై ప్రభావం చూపింది. ఇప్పుడు, సీనియర్ ఆటగాడెవరైనా జట్టులోకి పునరాగమనం చేయాలంటే అద్భుతమనదగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. కానీ, దేశవాళీ క్రికెట్లో రాణించడం ఇప్పుడంత సులువుగా కనిపించడంలేదు. అక్కడ కూడా నాణ్యమైన క్రికెటర్ల సంఖ్య పెరిగింది. పోటీతత్వం మెండుగా ఉన్న యువ క్రికెటర్లతో పోటీ పడి రాణించలేక వీరూ, గౌతీ, జహీర్ లు సెలక్టర్లను మెప్పించలేకపోతున్నారు. తాజాగా, కఠినమైన ఆస్ట్రేలియా సిరీస్ కు ఈ ముగ్గురిలో ఒక్కరిని కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఎంపిక సందర్భంగా వీళ్ల పేర్లే ప్రస్తావనకు రాలేదని సమాచారం. మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ మాట్లాడుతూ, సెహ్వాగ్ కథ ముగిసినట్టేనని, గంభీర్ కు మాత్రం కొంత భవిష్యత్తు ఉందని అన్నాడు. మాజీ కెప్టెన్, కోచ్ అజిత్ వాడేకర్ సెహ్వాగ్ విషయంపై స్పందిస్తూ, ఓపెనింగ్ స్థానానికి విపరీతమైన పోటీ నెలకొని ఉందని, జట్టులోకి రావడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. కెరీర్ సాఫీగా సాగుతున్న దశలో గాయాలపాలైన జహీర్ ఖాన్ జట్టులోకి పునరాగమనం చేయడం అసాధ్యమన్నది మాజీల మాట. 2011లో ఇంగ్లాండ్ పర్యటన నుంచి తప్పుకున్న తర్వాత, జహీర్ మ్యాచ్ ఫిట్ నెస్ పై సందేహాలు నెలకొన్నాయి. మధ్యలో ఓసారి జట్టులోకొచ్చినా, గాయాలు తిరగబెట్టడంతో ఈ లెఫ్టార్మ్ పేసర్ పరిస్థితి మరింత దిగజారింది.

  • Loading...

More Telugu News