: సచిన్ సలహా ఓ 'యువ'కుడి జీవితాన్ని మార్చివేసింది
అసహనం పెల్లుబుకుతున్న సమయాల్లోనూ నిశ్చలంగా ఉండే గుణమే ఓ క్రీడాకారుడి విశిష్ట స్వభావానికి నిలువెత్తు గీటురాయి.. అంటూ సచిన్ ఇచ్చిన సలహా తన జీవితాన్నే మార్చివేసిందని డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. గతంలో ఆసీస్ తో సిరీస్ లో ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్ లో తాను తక్కువ స్కోరుకే అవుటై డ్రెస్సింగ్ రూంలో బ్యాట్ ను విరగ్గొట్టానని యువీ గుర్తు చేసుకున్నాడు.
ఆ సమయంలో అక్కడే ఉన్న సచిన్ ఇదంతా చూసి, దగ్గరకొచ్చి, 'క్రికెట్ నీకు సమస్తమూ అందిస్తోంది. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, తిండి సంపాదిస్తున్నావు అంటే అదంతా క్రికెట్ చలవే. ఇంకెప్పుడూ ఇలా చేయకు, నేనెప్పుడూ ఇలా చేయలేదు' అని చెప్పాడని యువీ వెల్లడించాడు. అప్పటి నుంచి చిరాకును ఎప్పుడూ దరిచేరనీయకుండా, ఆటపైనే దృష్టి పెట్టి అమోఘంగా రాణించానని ఈ అగ్రెసివ్ బ్యాట్స్ మన్ చెప్పుకొచ్చాడు.