: చంద్రబాబు ముక్కేమన్నా పవర్ ప్లాంటా?: కేసీఆర్ పై సోమిరెడ్డి ఫైర్
తెలంగాణలో విద్యుత్ కష్టాలకు చంద్రబాబే కారణమని కేసీఆర్ అనడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, తనను ముఖ్యమంత్రిని చేస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని, మూడెకరాల పొలం ఇస్తానని కేసీఆర్ ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపాడని విమర్శించారు. ఇళ్లకు 24 గంటల కరెంటు ఇస్తానని, రైతులకు 9 గంటల విద్యుత్ ఇస్తానని ప్రకటించాడని, ప్రస్తుతం రైతులకు 3 గంటల విద్యుత్ కూడా రావడంలేదని తెలిపారు. ఈ కష్టాలకు చంద్రబాబే కారణమని, చంద్రబాబు ముక్కుపిండి కరెంటు వాటాను తీసుకుంటామని కేసీఆర్ అనడం సరికాదన్నారు. చంద్రబాబు ముక్కేమన్నా పవర్ ప్లాంటా, పిండితే కరెంటు రావడానికి? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతి దానికి ముక్కు నేలకేసి రాయాలని అంటారని, ఆయన ముక్కు పొడవుగా ఉంది కాబట్టి నేలకేసి రాయడం ఈజీ అని పేర్కొన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది మీడియాపై ప్రతాపం చూపడానికి కాదని హితవు పలికారు. రెండు చానళ్లను అడ్డుకోవడం కాదని, పరిపాలన విషయంలో ప్రతాపం చూపాలని, సమస్యలపై ప్రతాపం చూపాలని సూచించారు. తాను ముఖ్యమంత్రిని అన్న సంగతిని కేసీఆర్ మర్చిపోతున్నారని సోమిరెడ్డి విమర్శించారు. ఆంధ్రావాళ్లను తిడితే సమస్యలు పరిష్కారం కావన్నారు. అన్నీ వదులుకుని తాము వెళ్లిపోయామని చెప్పారు. కేసీఆర్ తీరు చూస్తుంటే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఓ ప్రణాళిక లేకుండా వ్యవహరించబట్టే తెలంగాణలో కరెంటు కష్టాలు ఉత్పన్నమయ్యాయని సోమిరెడ్డి విమర్శించారు.