: లైబ్రరీలోకి అమ్మాయిలను అనుమతిస్తే అబ్బాయిలు పోటెత్తుతారట!
మహిళా కళాశాల విద్యార్థినులను తమ వర్శిటీ లైబ్రరీలోకి అనుమతిస్తే, అబ్బాయిల తాకిడిని తట్టుకోలేరట! ఈ మాటలంటున్నది మరెవరో కాదు, సాక్షాత్తూ... ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ వైస్ చాన్సెలర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా! ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో అమ్మాయిలకు సభ్యత్వం ఇవ్వడంలేదట. అందుకాయన వివరణ ఇస్తూ, సమస్య క్రమశిక్షణకు సంబంధించినది కాదని, స్థలాభావం అసలు సమస్య అని చెప్పుకొచ్చారు. మామూలుగానే లైబ్రరీ కిక్కిరిసిపోతోందని అన్నారు. ఇక, అమ్మాయిలను అనుమతిస్తే అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుందన్నారు. వీసీ అభిప్రాయాలకు మహిళా కళాశాల ప్రిన్సిపాల్ నయీమా గుల్రెజ్ వంతపాడారు. విద్యార్థి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమ్మాయిలను కూడా లైబ్రరీలోకి అనుమతించాలన్న డిమాండును తాము అర్థం చేసుకున్నామని, అయితే, అబ్బాయిలతో నిండిపోయిన లైబ్రరీలోకి అమ్మాయిలు వెళితే, సమస్యలు తప్పవనీ అన్నారు.