: దేశవాళీ క్రికెట్ లోకి మళ్లీ పాక్ క్రికెటర్!
నిషేధానికి గురైన పాకిస్తాన్ ఎడమ చేతి వాటం బౌలర్ మహమ్మద్ అమీర్ దేశవాళీ క్రికెట్ లోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనల విషయంలో చేసిన మార్పుల నేపథ్యంలో మళ్లీ తాను వస్తున్నట్టు చెప్పాడు. "మంచి ఫిట్ నెస్ కోసం ఇప్పటికే నేను విస్తృత శిక్షణ తీసుకున్నాను. ఎప్పుడు ఐసీసీ నాకు క్లియరెన్స్ ఇస్తుందో, ఆ వెంటనే దేశవాళీ క్రికెట్ లోకి వస్తానని నమ్మకంగా ఉన్నా" అని అమీర్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ స్కాం నేపథ్యంలో అతనిపై పాక్ క్రికెట్ బోర్డు 2015, ఆగస్టు వరకు నిషేధం విధించింది. ఈ క్రమంలో 22 ఏళ్ల అమీర్ ను దేశవాళీ క్రికెట్ లోకి తీసుకునేందుకు ఏసీయు కోడ్ లో మార్పులు చేశామని పాక్ బోర్డు తెలిపింది. అటు స్కాం జరిగినప్పుడు అమీర్ కు పద్దెనిమిదేళ్ల వయసుందని, తన తప్పును అంగీకరించాడని, ప్రస్తుతం తానుగా పునరావాస కేంద్రంలో ఉండటంతో అతని విన్నపాన్ని ఆమోదించాలని పాక్ బోర్డు నిర్ణయానికొచ్చింది. మరోవైపు అతను కూడా పాక్ బోర్డుకు కృజ్ఞతలు తెలిపాడు.