: జై శ్రీరాం... జై శివాజీ: మహారాష్ట్ర అసెంబ్లీలో మిన్నంటిన నినాదాలు


మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం నినాదాలు హోరెత్తాయి. అవేవో పార్టీ నినాదాలు కాదు. వేర్వేరు మతాలకు చెందినవి అంతకన్నా కాదు. బీజేపీ, శివసేన ఎమ్మెల్యేలు పరస్పరం తమ బలాన్ని వెల్లడించుకునేందుకు చేసిన నినాదాలు. జై శ్రీరాం... అంటూ బీజేపీ ఎలుగెత్తితే, జై శివాజీ... అంటూ శివసేన నినదించింది. 25 ఏళ్లుగా మిత్రులుగానే ఉంటూ వచ్చిన ఆ రెండు పార్టీలు గడచిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విడివడిన సంగతి తెలిసిందే. అయితే తమ బంధం పూర్తిగా వీడలేదని నిన్నటికి నిన్న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే చెప్పుకొచ్చారు. అయితే తెల్లారేసరికి ఇరు పార్టీల మధ్య అనుమానపు బీజాలు మొలకెత్తాయి. అంతేకాక ఈ నెల 12న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. దీంతో తన మద్దతు లేనిదే ఫడ్నవీస్ గెలవలేరన్న ధీమాతో ఉన్న శివసేన, అధికార పక్షాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా, ధాటిగా సమాధానమిస్తోంది. మరి ఈ నినాదాలు ఈ రోజుకే పరిమితమవుతాయో, లేక రేపు, ఆ మరునాడు కూడా పునరావృతమవుతాయో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News