: రజినీకాంత్! మీరు రాజకీయాల్లోకి రావొద్దు: తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడి సలహా


సూపర్ స్టార్ రజినీకాంత్ ను రాజకీయాల్లోకి రావొద్దని తమిళనాడు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సూచించారు. అయితే, పాలిటిక్స్ లోకి రావాలనుకుంటే కనుక, ఒక్క కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీల్లోకి వెళ్లొద్దని పరోక్షంగా ఆయనను కోరారు. ఇటీవల జీకే వాసన్ పార్టీ నుంచి వెళ్లిపోయినా తరువాత ఇళంగోవన్ ను తాజాగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఎప్పటికీ రాజకీయాల్లోకి రావొద్దని రజనీకి సలహా ఇస్తున్నాను. ఇది నా అభిప్రాయం. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆయనకు అభిమానులున్నారు. తమిళనాడు ప్రజల్లో రజినీపట్ల విస్తృత స్థాయిలో గౌరవం ఉంది" అన్నారు. అయితే, దేశంలో ప్రజలంతా సెక్యులరిజంకు కట్టుబడి ఉన్నారని, దానికి కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పారు. అందుకే, అలాంటి కాంగ్రెస్ లోకి రజినీకాంత్ ను ఆహ్వానిస్తున్నామని ఇళంగోవన్ తెలిపారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే, ఏఐడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా పుంజుకునేందుకు రజినీకాంత్ ను పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేసింది. దానివల్ల 2016 అసెంబ్లీ ఎన్నికల కల్లా తమిళనాడులో బలోపేతం అయ్యేందుకు బీజేపీ వ్యూహ రచన చేసింది. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల సమయంలో రజినీ అప్పటి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి మోదీని కలిసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News