: జన్ ధన్ యోజన అకౌంట్లు 7 కోట్లు!


ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద ఇప్పటిదాకా 7 కోట్ల బ్యాంకు ఖాతాలు కొత్తగా నమోదయ్యాయి. అంతేగాక, ఈ ఖాతాల ద్వారా బ్యాంకులకు రూ.5 వేల కోట్లు డిపాజిట్ల రూపేణా జమ అయ్యాయి. ఇప్పటిదాకా బ్యాంకు ఖాతాలు లేని కారణంగా ఈ మొత్తం జనం ఇళ్లలోనే ఉండిపోయింది. జన్ ధన్ యోజన పథకంలో జీరో బ్యాలెన్స్ కింద ఖాతాలు జారీ చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాంకుల బాట పట్టారు. ఖాతాలు తెరవడంతో ఇళ్లలో మూలుగుతున్న రూ.5 వేల కోట్లు బ్యాంకులకు చేరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 3 నాటికి దేశవ్యాప్తంగా 6.98 కోట్ల బ్యాంకు ఖాతాలు ఓపెన్ కాగా, వాటిలో 4 కోట్ల ఖాతాలకు రూపే (ఏటీఎం) కార్డులు ఇప్పటికే జారీ అయ్యాయి. మిగిలిన 3 కోట్ల మేర కార్డులు త్వరలో ఖాతాదారులకు చేరనున్నాయి. ఆగస్టు 29న ప్రారంభమైన ఈ పథకం కింద 2015 జనవరి 26 నాటికి 7.5 కోట్ల ఖాతాలు జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే, గడువు కంటే ముందుగానే ఖాతాల సంఖ్య లక్ష్యం దాటిపోతున్న నేపథ్యంలో 2015 ఆగస్టు 15 నాటికి 15 కోట్ల ఖాతాలు తెరిపించాలని ఆర్థిక శాఖ తాజాగా తన లక్ష్యాన్ని సవరించుకుంది.

  • Loading...

More Telugu News