: మాజీ ప్రధాని మన్మోహన్ కు మోదీ అభినందనలు
పదేళ్ల పాటు దేశ ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ ఐదు నెలల క్రితం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. సరికొత్త పంథాలో ప్రచారాన్ని సాగించిన నరేంద్ర మోదీ, మన్మోహన్ ఖాళీ చేసిన పీఠాన్ని అధిష్ఠించారు. ఎన్నికల ముందు, తర్వాత వారిద్దరూ ఒకరినొకరు విమర్శించుకోకున్నా, వారి పార్టీలు వేరైన నేపథ్యంలో పరోక్ష బాణాలు తప్పవు కదా! అయితే, వాటన్నింటిని పక్కనపెట్టి ప్రధాని మోదీ, మన్మోహన్ సింగ్ తో మాట కలిపారు. అంతేకాదు, ఏకంగా అభినందనలే తెలిపారు. ఎందుకంటే, జపాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌలోనియా ఫ్లవర్స్’ను ఆ ప్రభుత్వం మన్మోహన్ కు అందజేసింది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా వినుతికెక్కిన మన్మోహన్ పై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. జపాన్ రాజు అకిహిటో చేతుల మీదుగా బుధవారం మన్మోహన్ ఈ అవార్డును అందుకున్నారు.