: సీఎం ఆఫీసును పన్నీర్ సెల్వం అవమానిస్తున్నారు: వైగో
అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత స్థానంలో సీఎంగా నియమితుడైన పన్నీర్ సెల్వంపై ఎండీఎంకే నేత వైగో విరుచుకుపడ్డారు. సెల్వం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ లోని సీఎం చాంబర్ ను ఎందుకు వినియోగించడం లేదని, ఆ చాంబర్ వెలుపల హోదాను తెలిపే నేమ్ ప్లేట్ ఎందుకు పెట్టుకోలేదని వైగో ప్రశ్నించారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, "తమిళనాడు చీఫ్ మినిస్టర్ పన్నీర్ సెల్వం ఓ ముఖ్యమంత్రిలా వ్యవహరించడం లేదు. సీఎం చాంబర్ ను వినియోగించడం లేదు. కనీసం నేమ్ ప్లేట్ కూడా లేదు. సీఎం పీఠం అనేది చట్టబద్ధమైన గుర్తింపు ఉన్న పదవి. అయితే, ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు " అని విమర్శించారు. దీనిపై, అన్నాడీఎంకే వర్గాలు స్పందించాయి. వైగో విమర్శలు అతిగా ఉన్నాయని ఎదురుదాడి చేశారు. కొత్త సీఎం తన పాత ఆఫీసు నుంచి కార్యకలాపాలు సాగించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన నేమ్ ప్లేట్ కోరుకోలేదని వారు తెలిపారు.