: ఆరేళ్లలో పదింతలైన రాజ్యసభ ఎంపీ ఆస్తులు!
సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ ఆస్తులు గడచిన ఆరేళ్లలో పదిరెట్లు పెరిగాయి. ఇదేదో అనధికారిక లెక్క కాదు. సాక్షాత్తు రాజ్యసభ సెక్రటేరియట్ కు ఆయనగారు స్వదస్తూరితో వెల్లడించిన వాస్తవ లెక్క. 2008లో రాజ్యసభ బరిలో నిలిచిన సందర్భంగా రూ.1.12 కోట్ల ఆస్తులను ప్రకటించిన యాదవ్, తాజాగా మరోసారి రాజ్యసభ బరిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈసారి తనకు రూ.10.49 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఈసారీ విజయం సాధిస్తే, మరో ఆరేళ్లలో ఇదే రీతిన ఆయనగారి ఆస్తులు రూ.100 కోట్లకు చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. గతంలో తనకు కారు కూడా లేదని తెలిపిన యాదవ్, తాజాగా తనకు ఓ లగ్జరీ కారుతో పాటు ఓ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ కూడా ఉన్నట్లు ప్రకటించారు. అయినా అప్పటిదాకా అంతగా పెరగని ఆయన ఆస్తులు, ఎంపీగా ఎన్నికైన తర్వాత అంత వేగంగా ఎలా పెరిగాయో మరి!