: టీ కాంగ్రెస్ లోకి స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి!
తెలంగాణలో టీఆర్ఎస్ లోకి వలసలు జోరందుకున్న నేపథ్యంలో టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా క్రమంగా ఖాళీ అవుతోంది. అయితే తాజాగా ఓ స్వతంత్య ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ జిల్లాలో పార్టీ తరఫున రెడ్యా నాయక్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన కూడా మంళవారం టీఆర్ఎస్ లో చేరారు. దీంతో పార్టీకి వరంగల్ జిల్లాలో అసలు ఎమ్మెల్యేలే లేని పరిస్థితి నెలకొంది. ఈ హఠాత్పరిణామంతో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పార్టీ అధిష్ఠానం ముందు తలెత్తుకోలేని స్థితిలో పడిపోయారు. అయితే జిల్లాలోని నర్సంపేట నుంచి కాంగ్రెస్ రెబెల్ గా బరిలోకి దిగి విజయం సాధించిన దొంతి మాధవ రెడ్డి, తాజాగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. దీంతో పొన్నాలకు మళ్లీ ఊపిరి పీల్చుకునే వెసులుబాటు లభించింది.