: 834 అడుగుల నీటి మట్టం దాకా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తాం: తెలంగాణ
శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 834 అడుగులకు చేరే దాకా విద్యుదుత్పత్తిని నిలిపివేసే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక రోజు విరామం తర్వాత మంగళవారం ఉదయం తిరిగి ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని తెలంగాణ జెన్ కో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, నిబంధనల మేరకు విద్యుదుత్పత్తిని నిలిపివేయాల్సిందేనని కృష్ణా నీటి యాజమాన్య బోర్డు ఆదేశాలు జారీ చేసింది. బోర్డు ఆదేశాలపై స్పందించిన తెలంగాణ సర్కారు, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుదుత్పత్తిని ఆపేది లేదని తేల్చిచెప్పింది. ప్రాజెక్టులో నీటి మట్టం 834 అడుగులకు చేరేదాకా విద్యుదుత్పత్తి చేస్తామని తెలంగాణ జెన్ కో అధికారులు చెప్పారు. దీంతో మరోమారు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.