: ఏపీ సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా మళ్లీ సతీష్ చంద్ర!
ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, రెండోసారి ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్ లో రెసిడెంట్ కమిషనర్ గా భాధ్యతలు నిర్వర్తిస్తున్న సతీష్ చంద్ర, ఇకపై ఏపీ సీఎం పేషీ ముఖ్య కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే, పదేళ్ల క్రితం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ సతీష్ చంద్ర సీఎం పేషీ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. నాడు ఆ పదవిలో మెరుగైన పనితీరు కనబరచి, చురుకైన, సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంతగా ప్రాధాన్యత లేని పోస్టులో నియమితులైన సతీష్ చంద్ర, కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. తాజాగా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో సతీష్ చంద్ర మళ్లీ రాష్ట్ర పాలనలో కీలక భూమిక పోషించేందుకు అవకాశం లభించింది.