: ఎకానమీ క్లాసులో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తొలి బీజేపీ నేతగానే కాక, ఆ పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కుల్లో రెండో వ్యక్తిగానూ చరిత్ర సృష్టించిన దేవేంద్ర ఫడ్నవీస్, పాలనలోనూ తనదైన ముద్ర వేయడం ఖాయమేనని ఇప్పటికే తేలిపోయింది. అయితే తాజాగా, ఇతర ముఖ్యమంత్రులకు భిన్నంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా అత్యంత సామాన్యంగా ఉండటంలోనూ ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకుంటున్నారు. ఆదివారం ముంబై నుంచి నాగ్ పూర్ కు బయలుదేరిన ఫడ్నవీస్, భార్య, కూతురుతో కలిసి నేరుగా ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో స్వయంగా డబ్బు చెల్లించి మూడు టికెట్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత నేరుగా జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఎకానమీ క్లాసులోకి ప్రవేశించిన ఫడ్నవీస్, తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడి ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఫడ్నవీస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటిదాకా మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన ఏ వ్యక్తి కూడా ఇలా సామాన్య జనంతో కలసి ప్రయాణించలేదని, ఫడ్నవీస్ పాలనలో రాష్ట్రంపై దుబారా తగ్గిపోవడం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.