: మరోమారు ‘ఎర్ర’ స్మగ్లర్ల స్వైరవిహారం... అటవీ శాఖ సిబ్బందికి గాయాలు
ఎర్ర చందనం స్మగ్లర్లు మరోమారు పంజా విసిరారు. ఎర్ర చందనం చెట్లను నరికేందుకు చిత్తూరు జిల్లా అడవుల్లోకి ప్రవేశించిన స్మగ్లర్లు, తమను అడ్డుకునేందుకు యత్నించిన అటవీ శాఖాధికారులపై దాడికి దిగారు. చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లి పరిసరాల్లో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 30 మందికి పైగా స్మగ్లర్లు మూకుమ్మడి దాడికి దిగడంతో అటవీ శాఖ సిబ్బంది పరుగులు పెట్లాల్సి వచ్చింది. వెదురు కర్రలతో స్మగ్లర్లు చేసిన దాడిలో అటవీ శాఖకు చెందిన నలుగురు సిబ్బంది గాయపడ్డట్లు ప్రాథమిక సమాచారం. దాడి సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు స్మగ్లర్ల కోసం అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.