: నేడు కర్నూలు జిల్లా 'జన్మభూమి'లో చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లాలోని ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో నిర్వహించే 'జన్మభూమి' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరవుతారు. జన్మభూమిలో భాగంగా గతంలోనే కర్నూలు జిల్లాలో పర్యటించాల్సి ఉన్న చంద్రబాబు, నాడు హుదూద్ తుపాను కారణంగా జన్మభూమి కార్యక్రమాలను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జన్మభూమి కార్యక్రమం పునరుద్ధరణ కావడంతో నేడు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే, జిల్లాలోని బనగానపల్లె మండలంలోనూ చంద్రబాబు పర్యటించాల్సి ఉన్నప్పటికీ, బిజీ షెడ్యూల్ కారణంగా అధికారులు ఆ పర్యటనను రద్దు చేశారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.