: కాంగ్రెస్ కి మరో రాష్ట్రంలో గడ్డు కాలం... పాత పార్టీ పురుడు పోసుకోనుందా?
దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. తాజా ఎన్నికల్లో చతికలబడిన కాంగ్రెస్ పార్టీకి తమిళనాట ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్ల ఆగ్రహాన్ని చవి చూసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై తమిళ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి మొదలైందని కథనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం, విధానాలపై తమిళ నాట కాంగ్రెస్ నేత జీకే మూపనార్ కుమారుడు జీకే వాసన్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, దానికి కారణం కాంగ్రెస్ అధిష్ఠానమేననే భావనలో ఉన్న వాసన్ పార్టీ వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం. తన తండ్రి ముపనార్ ప్రారంభించిన 'తమిళ మానిల కాంగ్రెస్' (టీఎంసీ) పునరుద్ధరణకు ఆయన సన్నాహాలు ఆరంభించారని తమిళనాట వార్తలు వినపడుతున్నాయి. దీంతో తమిళనాట పాత పార్టీ మళ్లీ పురుడుపోసుకోనుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి.