: నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా మారిన వెంకయ్యనాయుడు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత విశ్వాసపాత్రునిగా తెలుగు నేత వెంకయ్యనాయుడు మారారు. మోదీ కోర్ టీంలో ఉన్న కీలక మంత్రుల్లో వెంకయ్యనాయుడుకు అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఇటీవల, ప్రతీ కార్యక్రమంలో మోదీ వెంకయ్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. శుక్రవారం సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా విజయ్ చౌక్ నుంచి ప్రధాని ఐక్యతా పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, మోదీ తర్వాత వెంకయ్యకు అధిక ప్రాధాన్యం లభించింది. ఈ కార్యక్రమానికి సుష్మా స్వరాజ్ తో పాటు చాలా మంది కేబినెట్ మంత్రులు హాజరైనా మోదీ వెంకయ్యకే ఇంపార్టెన్స్ ఇచ్చి కార్యక్రమానికి సారధ్యం వహించాలని కోరారు. ఇటీవల కాలంలో ప్రధాని ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, దానికి వెంకయ్యే సారధ్యం వహించాలని కోరుకుంటున్నారని ఢిల్లీ బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్యనే, గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరైనప్పటికీ... మోదీ వెంకయ్యకే సారధ్య బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే, ఇటీవల ప్రధాని నివాసంలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో నిర్వహణ బాధ్యతలను వెంకయ్యకే అప్పగించారు. కేంద్ర కేబినెట్ లో అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడుల అభిప్రాయాలకు మోదీ ఎక్కువ విలువను ఇస్తున్నారని ఢిల్లీలో ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.