: తప్పంతా ఏపీదే... బోర్డు నిర్ణయాన్ని ఏపీ ప్రభావితం చేసింది: హరీష్ రావు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తీర్పు ఇప్పించిందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కృష్ణా బోర్డు తన పరిథిని దాటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. నీటి వాటాలు నిర్ణయించాల్సిన అధికారం ట్రైబ్యునల్ కే ఉందని, బోర్డుకు లేదని ఆయన స్పష్టం చేశారు. శ్రీశైలం జలవివాదంపై కృష్ణా బోర్డు ప్రకటించిన నిర్ణయం అనైతికం, ఏకపక్షమని ఆయన ధ్వజమెత్తారు. బోర్డు నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిడి ఉన్నట్టు అనుమానం కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ హక్కుల సాధనకు న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బోర్డు నిర్ణయానికి తమ ప్రభుత్వం బెదరదని చెప్పిన ఆయన, ఎంత ఖర్చు చేసైనా తమ రైతులకు విద్యుత్ కొనుగోలు చేస్తామని అన్నారు. తెలంగాణ రైతులను కష్టాల్లోకి నెట్టేందుకు ఏపీ సీఎంతో కలసి కేంద్రం కుయుక్తులు పన్నుతోందని ఆయన మండిపడ్డారు. ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ రాకపోయినా కేంద్రం చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణకు స్థానం లేకపోవడం వల్లే తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News