: షాహీ ఇమాం అందరినీ పిలిచాడు... మోదీని తప్ప!
భారత్ లోని ముస్లింలకు ఓ రకంగా పెద్ద అని భావించదగ్గ వ్యక్తి (షాహీ ఇమాం) సయ్యద్ అహ్మద్ బుఖారీ. ఢిల్లీలోని జామా మసీదు నుంచి ఆయన కార్యకలాపాలు కొనసాగుతాయి. ఆయన నవంబర్ 22న తన కుమారుడిని నయీబ్ షాహీ ఇమాం (ఉప ఇమాం)గా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని ప్రముఖ నేతలందరికీ ఆహ్వానం వెళ్ళింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు. చివరికి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను సైతం ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీని మాత్రం దూరంపెట్టారు. ఈ విషయాన్ని షాహీ ఇమాం స్వయంగా చెప్పారు. గుజరాత్ అల్లర్ల విషయంలో మోదీపై ముస్లింల అభిప్రాయంలో మార్పులేదని, ఆయనను వారు క్షమించబోరని అన్నారు. మోదీకి తామంటే ఇష్టం లేదని, అందుకే, తాము కూడా ఆయనను అభిమానించడం లేదని ఇమాం అన్నారు. దీనిపై బీజేపీ మండిపడింది. భారత్ లో పుట్టిన ముస్లింలు భారత్ ను ప్రేమిస్తారని, పాకిస్థాన్ పై ప్రేమ ప్రదర్శించరని బీజేపీ ప్రతినిధి నళిన్ కోహ్లీ విమర్శించారు. షరీఫ్ కు ఆహ్వానం పంపి, మోదీని దూరం పెట్టడం ద్వారా ఇమాం ఏం చెప్పదలుచుకున్నారని నళిన్ ప్రశ్నించారు.