: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల్లో 'యువరాజా'వారి పెత్తనం ఎక్కువైంది: దేవినేని


చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై కృష్ణా జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దేవినేని నెహ్రూ మండిపడ్డారు. రాజధాని విషయంలో లోకేష్ అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. కొత్త రాజధాని నిర్మాణం జరిగే ప్రదేశంలో, లోకేష్ ముందుగానే వందలాది ఎకరాల భూములు కొనిపెట్టుకున్నాడని ఆరోపించారు. వీటి ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలని చూస్తున్నాడని ఆయన విమర్శించారు. ఒకే వ్యక్తి నుంచి 125 ఎకరాల భూమిని కొన్నట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. విజయవాడ సమీపంలో లోకేశ్ భూములకు సంబంధించిన రికార్డులను తాను సేకరిస్తున్నానని, త్వరలో విజయవాడలో బహిరంగసభ ఏర్పాటు చేసి మరీ రుజువులతో వివరాలన్నీ బయటపెడతానని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల్లో 'యువరాజా' వారి పెత్తనం ఎక్కువైపోయిందని అన్నారు. చంద్రబాబును ఏదైనా పని నిమిత్తం కలవాలంటే 'యువరాజు' అనుగ్రహం ఉండాల్సిందేనన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వ వ్యవహారాల్లో వేలు పెట్టడం తానెన్నడూ చూడలేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News