: ఆకాశాన్ని ఆక్రమించిన స్కై డైవర్లు... అమెరికాలో అద్భుతం
'సాహసం సేయరా ఢింబకా... రాజకుమారి లభిస్తుంది' అంటాడు 'పాతాళభైరవి'లో మాంత్రికుడు వేషధారి యస్వీఆర్. అంటే, సాహసం చేస్తేనే ఏదైనా లభిస్తుందన్నది దానర్థం! ఈ క్రమంలో, ధైర్యవంతులు ఆకాశమే హద్దుగా సాహసయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ స్కై డైవర్లు కూడా అలాంటివాళ్లే. ఆకాశాన్ని కమ్మేశారు. ఇంతకీ స్కై డైవర్లు ఆకాశాన్ని ఎలా ఆక్రమించారనేగా మీ డౌటు. వివరాల్లోకెళితే... అమెరికాలోని టెక్సాస్ కు చెందిన 57 మంది స్కై డైవర్లు ప్రపంచ రికార్డు కోసం ఆకాశాన్ని ఆక్రమించారు. భూమికి 16 వేల అడుగుల కంటే ఎత్తు నుంచి దూకిన 57 మంది స్కై డైవర్లు, సరిగ్గా 16 వేల అడుగుల ఎత్తుకు చేరుకునే సరికి, అందరూ చేతులు పట్టుకుని పలు ఆకారాల్లో ఆకాశంలో గిరికీలు కొట్టారు. ఈదురు గాలిలో ఏటికి ఎదురీదే చేపపిల్లల్లా ఆకాశంలో పలు విన్యాసాలు చేశారు. ఈ రికార్డు సాధించేందుకు కొన్ని వారాలపాటు వీరంతా సాధన చేశారు. అనుకున్న రికార్డు సృష్టించి, అందరూ సురక్షితంగా నేలకు చేరారు.