: యూపీ పోలీసులకు కొత్త లుక్కు!
ఖాకీ షర్టు, ఖాకీ ప్యాంటు, నెత్తిన ఉలెన్ టోపీ, కాళ్ళకు పాతకాలపు లెదర్ షూ... ఇదీ, భారత్ లో కనిపించే పోలీసు అవతారం! ఇప్పుడా వేషధారణను మార్చాలని ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్ మెంట్ యోచిస్తోంది. ఆధునిక పోలీసింగ్ కు అనుగుణంగా యూనిఫాంలో మార్పులు తేవాలనుకుంటున్నామని యూపీ శాంతిభద్రతల విభాగం ఐజీ సతీశ్ గణేశ్ తెలిపారు. పోలీసు యూనిఫాంకు సంబంధించి 200కి పైగా పాత ఐటెంల స్థానంలో కొత్తవి తీసుకురావాలనుకుంటున్నట్టు చెప్పారు. 1986 నుంచి పోలీసు డ్రెస్సులో ఎలాంటి మార్పులు లేవని, ఇప్పుడు పోలీసులకు కొత్త లుక్కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఐజీ పేర్కొన్నారు. యూనిఫాంలో మార్పులకు పోలీసు నిబంధనల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. కాగా, 2012లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు డ్రెస్ కోడ్ మార్చింది. సాధారణ పోలీసులకు కూడా డ్రెస్ కోడ్ మార్చేందుకు సర్కారు సమ్మతిస్తుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.