: క్లాస్ రూంలో ఉన్న విద్యార్థిపై దండెత్తిన ఎమ్మెల్యే దంపతులు... తనయుడి కోసం!


ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లామ్ తన కుమారుడి కోసం ఏంచేశారో చూడండి! తనయుడు చదువుతున్న పాఠశాలకు భార్యా సమేతంగా వెళ్ళి, ప్రిన్సిపాల్ చూస్తుండగానే, ఓ విద్యార్థి చెంప చెళ్ళుమనిపించారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు, కనీసం, వ్యాఖ్యానించేందుకు కూడా స్కూలు యాజమాన్యం సాహసించలేకపోయింది. అయితే, ఎమ్మెల్యే చేతిలో చెంపదెబ్బ తిన్న బాలుడి తల్లి సుల్తానా మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. తన కుమారుడు మహ్మద్ అలీ, ఎమ్మెల్యే కుమారుడు షర్ఫ్ ఒకే తరగతి చదువుతున్నారని తెలిపింది. వారిద్దరూ స్నేహితులని కూడా చెప్పింది. సోమవారం మధ్యాహ్నం ఫోన్ వచ్చిందని, తన కుమారుడు ఎత్తితే, ఎమ్మెల్యే భార్య ఆయేషా సలీమ్ బెదిరింపులకు పాల్పడిందని సుల్తానా వివరించింది. దీనిపై ఆయేషా భిన్న కథనం వినిపించింది. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర అని ఆరోపించింది. "అలీ మా అబ్బాయిని రోజూ వేధిస్తాడు. ఆ విషయమే స్కూలు యాజమాన్యానికి చెప్పాలని వెళ్ళాం" అంటూ వివరించింది. దీనిపై, సుల్తానా స్పందిస్తూ, కొన్ని రోజుల కిందట ఎమ్మెల్యే కుమారుడు తన కొడుకును థర్మాస్ ఫ్లాస్క్ తో కొట్టాడని... ప్రతిగా తన కుమారుడు స్కేలుతో కొట్టాడని తెలిపింది. ఆ విషయం అంతటితో సద్దుమణిగిందని పేర్కొంది. అయితే, మంగళవారం నాడు ఎమ్మెల్యే స్కూలుకు వెళ్ళి తన కొడుకుపై చేయి చేసుకున్నాడని చెప్పింది సుల్తానా. ఎమ్మెల్యే భార్యకు తాను క్షమాపణలు చెప్పినా, ఇలా చేశారని వాపోయింది. దీనిపై స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేశానని, వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూసి, తదుపరి చర్యకు ఉపక్రమిస్తానని ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News