: 'హుదూద్' తుపానుపై ఎఫ్ బీలో రాజకీయ కామెంట్లు... యువకుడి అరెస్టు
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే సమస్యలు తప్పవు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ యువకుడు అటువంటి పని చేసే కటకటాల పాలయ్యాడు. ఇటీవల సంభవించిన హుదూద్ తుపాను ధాటికి విశాఖ నగరం బాగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దానిపై "ఐ లవ్ యు హుదూద్. మోసం చేసిన వారిని ప్రకృతి ఎంపిక చేసుకుని మరీ శిక్షించింది. దేవుడున్నాడని ఇప్పుడే తెలిసింది" అని చాగంటి రాహుల్ రెడ్డి అనే యువకుడు పోస్టు చేశాడు. దాంతో, పోలీసులు అతడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు అరండల్ పేటకు చెందిన న్యాయ విద్యార్థి అయిన రాహుల్ కొన్ని రోజుల కిందట ఆ వ్యాఖ్యలు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. అతని వ్యాఖ్యలు 'బాధ్యతా రహితంగా, ప్రజల సెంటిమెంటుకు వ్యతిరేకంగా' ఉన్నాయన్నారు. ఈ క్రమంలో శత్రుత్వ ప్రచారం, వివిధ సమూహాల మధ్య ద్వేషం పెంచుతున్నాడన్న ఆరోపణలతో అతనిని అరెస్టు చేశామని వివరించారు. అంతకుముందే రాహుల్ వ్యాఖ్యలను షేర్ చేసుకున్న సికింద్రాబాదుకు చెందిన సముద్రాల ఉదయ్ కుమార్ అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ తన పోస్టును డిలీట్ చేశాడని పోలీసులు చెప్పారు. తరువాత కొంత సమయం తీసుకుని అసలు వ్యక్తిని పట్టుకున్నామన్నారు. అయితే, లా చివరి సంవత్సరం చదువుతున్న తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తనని, లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీని ఓడించి, బీజేపీని గెలిపించిన కోపంతోనే ఇలాంటి రాజకీయ కామెంట్లు చేసినట్లు వివరించాడు. అటు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.