: మీకేం కావాలి? మీ పిల్లలకేం కావాలి? అంటూ చంద్రబాబు ప్రలోభపెట్టారు: తలసాని
మీర్ పేటలో జరిగిన బహిరంగ సభలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళుతున్నారని తెలిసి... వారిని పర్సనల్ గా పిలిపించుకుని, మీకేం కావాలి? మీ పిల్లలకేం కావాలి? అంటూ అనేక రకాలుగా చంద్రబాబు తమను ప్రలోభపెట్టారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. చంద్రబాబును ఉద్దేశించి ‘‘బిడ్డా! మరో జన్మ ఎత్తినా తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం రాదు. హైదరాబాద్ మాది. మా తడాఖా చూపిస్తాం’’ అంటూ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడిలా పాటుపడుతున్నారని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే తాను టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు.