: హైదరాబాదులోని సెటిలర్లంతా మా వాళ్లే!: కేసీఆర్
తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి సానుకూల వ్యాఖ్యలు చేశారు. తలసాని, తీగల, గంగాధర్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా హైదరాబాదులోని టీకేఆర్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాదులో సెటిలైన బిడ్డలను బాధపెట్టాల్సిన అవసరం కానీ, సందర్భం కానీ లేదని అన్నారు. హైదరాబాదులో ఆంధ్ర ప్రాంత పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెడితే రెడ్ కార్పెట్ వేస్తామని ఆయన పేర్కొన్నారు. 'హైదరాబాదులో నివసించే వాళ్లంతా మా వాళ్లే'నని ఆయన తొలిసారి చెప్పారు. సెటిలర్లకు రేషన్ కార్డులు ఉంటే వాటిని రద్దు చేయమని, అవసరమైన వాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత తనదేనని ఆయన తెలిపారు. కావాలంటే వేల ఎకరాలు సినీపరిశ్రమకు ఇచ్చి మరింత వృద్ధి చెందేలా చేస్తామని ఆయన పేర్కొన్నారు.