: జమ్మూ కాశ్మీర్లో డీఐజీ తనయుడి అధికార గర్వం
జమ్మూ కాశ్మీర్ డీఐజీ షకీల్ బేగ్ కుమారుడు టోనీ బేగ్ ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేసిన వీడియోలను పరిశీలిస్తే, అధికార గర్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. తన తండ్రి, తాను అధికారాన్ని ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నామని కూడా క్యాప్షన్ పెట్టాడు. టోనీ పోస్టు చేసిన ఫోటోల్లో... ఒకదాంట్లో డీఐజీ షకీల్ బేగ్ కూర్చుని ఉండగా, ఆయన కాళ్ళకు ఓ కానిస్టేబుల్ బూట్లు తొడుగుతున్న దృశ్యం కనిపిస్తుంది. మరో ఫోటోలో, తండ్రీతనయులు వస్తుండగా వారికి ఓ వ్యక్తి గొడుగు పట్టుకుని వస్తుంటాడు. టోనీ బేగ్ ఉన్న మరో ఫోటోలో ఓ బాడీగార్డు గోల్ఫ్ ఆటలో సాయపడుతుండడం చూడొచ్చు. ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో స్పందనలు వచ్చాయి. చెత్త ఫోటోలని ఓ వ్యక్తి కామెంట్ చేయగా, ఇతడు సద్దాం హుస్సేనేమో అని తనకు సెకండ్ థాట్ వస్తోందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక, ఈ విషయమై ఇండియన్ ఎక్స్ ప్రెస్ డీఐజీ షకీల్ ను వివరణ అడగ్గా, 'ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు అంత సీనుందా?' అన్న రీతిలో బదులిచ్చారు. తనకు మీటింగ్ ఉందని, తర్వాత కలుస్తానని చెప్పి సమాధానం దాటవేశారు.