: యూట్యూబ్ లో ఇకపై ప్రకటనలు లేని వీడియోలు!
యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నారా? వీడియోపై క్లిక్ చేయగానే అర నిమిషం పాటు వాణిజ్య ప్రకటనలు ప్రత్యక్షం. దీంతో, వీక్షకులకు చిర్రెత్తుకొస్తుంది. ఇకపై ఇలాంటి తలనొప్పులకు చెక్ పెట్టేస్తామంటున్నారు యూట్యూబ్ ను నిర్వహిస్తున్న గూగుల్ బాసులు. అయితే, అలాంటి యాడ్ ఫ్రీ వీడియోలు కావాలనుకునేవారు కొంత మేర రుసుము చెల్లించాలని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుశాన్ చెబుతున్నారు. ఇలా నిర్దేశిత రుసుము చెల్లించే వారికి ప్రత్యేక యూట్యూబ్ వెర్షన్ ను అందిస్తామని సుశాన్ చెప్పారు. ఈ తరహా సబ్ స్క్రిప్షన్ కలిగిన వారికి యూట్యూబ్ వీడియోల్లో ప్రకటనలు దర్శనమివ్వవు. నేరుగా వీడియోలు ప్రత్యక్షమవుతాయి. వీడియో వెబ్ సైట్లలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న యూట్యూబ్ ను నిత్యం 100 కోట్లకు పైగా నెటిజన్లు సందర్శిస్తున్నారు. మరింత మంది నెటిజన్లను ఆకర్షించేందుకే ఈ తరహా కొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నామని సుశాన్ తెలిపారు.