: మరణించిందనుకున్న యువతి మళ్లీ వచ్చింది!


కొన్ని నెలల కిందట మరణించిందనుకున్న యువతి ప్రాణాలతో వచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమిళనాడు పుడుకొట్టైకి చెందిన వినీల (21) అనే యువతి అదృశ్యమైంది. ఆమె కోసం వెతికిన తల్లిదండ్రులు ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో, ఓ అమ్మాయి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. దీంతో, ఆ మృతదేహం మిస్సయిన వినీలదేమోననే అనుమానంతో ఆమె తల్లిదండ్రులను పిలిపించారు. ఆ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు తమ కుమార్తేనని భోరుమన్నారు. ఇంటికి తీసుకెళ్లి ఆ మృతదేహానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. కొన్ని నెలలు గడిచిన తరువాత వినీల ఇంటికి చేరుకుంది. దీంతో, ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. విషయం తెలిసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి, ఆ తరువాత తల్లిదండ్రులకు ఆప్పగించారు. ఇల్లు ఎందుకు వదిలిపెట్టావని న్యాయస్థానం ప్రశ్నించగా, తన తల్లిదండ్రులు పెళ్లి చేయని కారణంగా ఇల్లు విడిచి వెళ్లానని ఆ యువతి తెలిపింది. మరి, ఇంతకుముందు లభ్యమైన మృతదేహం ఎవరిదన్నది పోలీసులు తేల్చాలి!

  • Loading...

More Telugu News