: చైనాకు చెక్ పెట్టేందుకు వియత్నాంకు భారత్ బ్రహ్మోస్ క్షిపణులు?
రక్షణ వ్యవహారాల్లో మోదీ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. ఆత్మరక్షణ ధోరణికే అధిక ప్రాధాన్యమిచ్చిన గత యూపీఏ సర్కారులా కాకుండా, వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటోంది. తాజాగా, చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే దిశగా వియత్నాంకు అధునాతన బ్రహ్మోస్ క్షిపణులను అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఎత్తుగడ కార్యరూపం దాల్చితే మాత్రం, చైనా దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయించినట్టయితే అది మరింత తీవ్రరూపం దాల్చడం తథ్యం. బ్రహ్మోస్ ప్రధానంగా నౌకా లక్ష్యత (యాంటీ షిప్) క్షిపణి. గత యూపీఏ సర్కారు వియత్నాంకు ఆయుధ సంపత్తిని విక్రయించేందుకు నిరాకరించింది. కాగా, వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ తాన్ డుంగ్ రెండ్రోజుల భారత పర్యటన నేడు ఆరంభం కానుంది. వియత్నాం ప్రధానితో చర్చల నేపథ్యంలో మోదీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.