: మెగా ఫ్యామిలీకి క్రమంగా దూరమవుతున్న పవన్ కల్యాణ్?
పవన్ కల్యాణ్... రాజకీయాల్లో సరికొత్త సంచలనం. సాక్షాత్తూ ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడు. గత కొంత కాలంగా ఆయన వేసే ప్రతి అడుగూ పెద్ద చర్చనే లేవనెత్తుతోంది. తాజాగా, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన 'పిల్ల నువ్వు లేని జీవితం' సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన్ హాజరు కాలేదు. తేజూ అంటే పవన్ కు అంతులేని ప్రేమ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, తేజూ ఫిలిం ఇండస్ట్రీలోకి రావడం వెనుక పవన్ పాత్రే కీలకం. అలాంటి పవన్ తన మేనల్లుడి సినిమా ఫంక్షన్ కు డుమ్మా కొట్టారు. అంతకు ముందు, రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరి వాడేలే' ఆడియో ఫంక్షన్ కు కూడా పవన్ హాజరు కాలేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్లకు సాధారణంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు, మెగా హీరోలు, అల్లు అరవింద్ తరలివస్తారు. 'పిల్ల నువ్వు లేని జీవితం' ఫంక్షన్ కు కూడా వీరంతా వచ్చారు, ఒక్క కల్యాణ్ తప్ప! ఫంక్షన్ కొనసాగుతున్న సమయంలో... అభిమానులు పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్ అంటూ గట్టిగా అరిచారు కూడా. ఈ సందర్భం మెగా హీరోలకు చాలా ఇబ్బందిని కలిగించిందని ఫంక్షన్ ను లైవ్ లో చూస్తున్న వారందరికి చాలా ఈజీగానే అర్థమయి ఉంటుంది. ప్రస్తుతం పవన్ గైర్హాజరీ మరోసారి చర్చను లేవనెత్తుతోంది. మెగా ఫ్యామిలీకి పవన్ కల్యాణ్ దూరంగా ఉంటున్నారని ఇప్పటికే అందరూ భావిస్తున్నారు. మెగా అభిమానులు కూడా రెండు వర్గాలుగా నిట్టనిలువునా చీలారని కూడా టాక్ ఉంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి, పవన్ కు గ్యాప్ బాగా పెరిగిందని సినీ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. రాజకీయపరంగా చిరంజీవి ఆలోచనలకు, పవన్ సిద్ధాంతాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో, రాజకీయ కారణాలతోనే మెగా ఫ్యామిలీకి పవన్ దూరంగా ఉంటున్నారా? అనే సందేహం కూడా తలెత్తుతోంది. మరోవైపు, కుటుంబంలో మరేదైనా అంతర్గత సమస్య తలెత్తిందా? అని కూడా డౌట్ పడుతున్నవారు లేకపోలేదు. ఏదేమైనప్పటికీ... పవన్ ఒంటరి ప్రయాణాన్ని ఓ వర్గం అభిమానులు కరెక్ట్ అంటుంటే... మెగా ఫ్యామిలీ అంతా కలిసే ఉండాలని మరో వర్గం అభిమానులు ఆశిస్తున్నారు. మరి... భవిష్యత్తులో ఏం జరగబోతుందో... లెటజ్ వెయిట్ అండ్ సీ!