: ఇక ఢిల్లీలో 'రింగు రోడ్డు రైలు' మార్గం
ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు దేశ రాజధానిలో 'రింగు రోడ్డు రైలు' మార్గాన్ని నిర్మించాలని కేంద్రం తలపోస్తోంది. ట్రాఫిక్ చక్రవ్యూహంలో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీ వాసుల కష్టాలు తీర్చాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో 'రింగు రోడ్డు రైలు' మార్గాన్ని నిర్మించే దిశగా ఆలోచిస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రానున్న రోజుల్లో ఢిల్లీలో మరిన్ని ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు మార్గాలను నిర్మించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని ఆయన వివరించారు. అందుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించేందుకు పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. 45 రోజుల్లో ఆ కమిటీ తనకు నివేదిక సమర్పిస్తుందని, ఆ తరువాత కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా ఆయా ప్రాజెక్టులను చేపడతాయని ఆయన వెల్లడించారు.