: గుర్గావ్ రేవ్ పార్టీపై పోలీసుల దాడి... 50 మంది అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లో శనివారం ఓ రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పార్టీలో పాలు పంచుకున్న 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 15 మంది యువతులున్నారు. సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబా హోటల్ లో గుట్టుగా రేవ్ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో హోటల్ పై దాడి చేసిన పోలీసులు హోటల్ యజమానులు సుదీప్ విజ్, అభిషేక్ విజ్ లతో పాటు పార్టీని ఏర్పాటు చేసిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక పార్టీకి హాజరైన యువకులంతా ఢిల్లీకి చెందిన వారేనని పోలీసులు చెప్పారు. వీరిని ఆదివారం ఉదయం దాకా స్టేషన్ లోనే ఉంచుకున్న పోలీసులు ఆ తర్వాత వారిని వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. హోటల్ యజమానులు, నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి.