: బీజేపీ వైపు కిరణ్ బేడీ మొగ్గు!
దేశంలో తొలి మహిళా ఐపీఎస్ అధికారిగానే కాక విధి నిర్వహణలో నిజాయతీ అధికారిగా పేరుగాంచిన కిరణ్ బేడీ, ఆమ్ ఆద్మీ పార్టీకి క్రమంగా దూరమవుతున్నారు. అదే సమయంలో అధికార బీజేపీకి చేరువవుతున్నారు. ఇటీవల ఆమె ప్రకటనలను చూస్తే ఈ విషయాలు నిజమేననిపిస్తోంది. ఢిల్లీ సీఎం రేసులో తాను లేనని ప్రకటించిన కిరణ్ బేడీ, కేంద్రంలో స్థిరమైన కూటమికే ప్రజలు ఓటేశారని చెప్పారు. "ఢిల్లీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. స్వచ్ఛ భారత్ అందులో ఓ భాగమే. అవినీతి రహిత భారత్ కోసం రామ్ లీలా మైదానంలో చేసిన పోరుకు సమాంతరంగా మోదీ పనిచేసుకుపోతున్నారు. స్థిరమైన పాలన అందించడమే కాక, స్వచ్ఛమైన నాయకత్వం నెరపుతున్నారు. గడచిన ఐదు నెలల్లో మిలియన్ డాలర్ల మేర జరిగిన ఒప్పందాల్లో ఒక్క అవినీతి మరక కూడా కనిపించలేదు" అని మోదీ సర్కారుపై బేడీ ప్రశంసల వర్షం కురిపించారు. "లంచం తీసుకోను, తీసుకోనివ్వను అని మోదీ చెప్పారు. ఓ విజన్ తో మోదీ ముందుకెళుతున్నారు. వ్యవస్థ మూలాలు, సాంకేతికత, మాస్ ఫాలోయింగ్ ఉన్న మోదీలాంటి సర్కారుతో కలసి పనిచేయడంలో తప్పేముంది?" అని కూడా బేడీ వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు పనితీరును చూసిన ఢిల్లీ ఓటర్లు కేంద్రాన్ని బాధపెట్టే నిర్ణయం తీసుకోరని ఆమె చెప్పారు. ఈ తరహా వ్యాఖ్యలతో బేడీ దాదాపుగా బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించే అవకాశాలు లేకపోలేదన్న అంచనాలు ఊపందుకున్నాయి. అంటే, కిరణ్ బేడీ ఆప్ కు దూరమైనట్టే కదా!